తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌య విశిష్ట‌త ఏమిటి?

అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌య విశిష్ట‌త ఏమిటి?

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 07:12 PM IST

అనంత పద్మనాభస్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏంటి? అనే విషయాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా తెలియజేశారు.

అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌య విశిష్ట‌త
అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌య విశిష్ట‌త (pinterest)

మ‌హావిష్ణువును ఆరాధించే వారికి 108 వైష్ణ‌వ దివ్య క్షేత్రాలు చాలా ప్ర‌త్యేక‌మైన‌వ‌ని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ 108 దివ్య క్షేత్రాల్లో సుప్ర‌సిద్ధ‌మైన‌టువంటి ఒక క్షేత్ర‌మే కేర‌ళ‌లోని శ్రీ అనంత ప‌ద్మ‌నాభ‌స్వామి క్షేత్రమ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

మ‌హావిష్ణువుకి అనంతుడు అని పేరు. ఈ ప్ర‌పంచ‌మంతా అనంతుడిగా ఆయ‌నే ఉన్నాడ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. వాసుకి మీద శ‌య‌నిస్తు మ‌హావిష్ణువు రూపంలో అనంత ప‌ద్మ‌నాభుడిని ద‌ర్శించ‌డం చాలా విశేష‌మ‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అనంత ప‌ద్మ‌నాభుడి విశిష్ట‌త గురించి భార‌తీయ పుర‌ణాలైన‌టువంటి విష్ణు పురాణం, బ్ర‌హ్మ పురాణం, మ‌త్స్య పురాణం, వ‌రాహ పురాణం, స్కంద‌, ప‌ద్మ‌, వాయు, భ‌గ‌వ‌త పురాణాల‌తోపాటు మ‌హాభార‌తంలో కూడా స్ప‌ష్టంగా చెప్పబడిందని చిలకమర్తి తెలిపారు.

ప‌ర‌శురాముడు ద్వాప‌రయుగంలో ఈ క్షేత్రాన్ని ద‌ర్శించి అనంత ప‌ద్మ‌నాభుడిని శుద్ధి చేశాడని చెప్ప‌బ‌డింది. కేర‌ళ మ‌హ‌త్యం ప్ర‌కారం ప‌రశురాముడు ఆల‌య శుద్ధి చేసి అక్క‌డ తంత్రాన్ని స్థాపించి.. దాన్ని నంభూత్రిప‌దకు అందచేసిన‌ట్టుగా చెప్ప‌బ‌డింది. ఈ విష‌యాన్ని బ్ర‌హ్మాండ పురాణం కూడా చెప్ప‌బ‌డింద‌ని చిల‌క‌మ‌ర్తి తెలియ‌జేశారు. ఈ ఆల‌య క్షేత్ర ద‌ర్శ‌నం వ‌ల్ల విష్ణుమూర్తి అనుగ్ర‌హం ల‌భించి.. ల‌క్ష్మీ క‌టాక్షం సిద్ధిస్తుంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

జీవితంలో ప్రతిఒక్కరు దర్శించాల్సిన మహా క్షేత్రం శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయమ‌న్నారు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ ఆలయం ఉన్నది. భార‌త‌దేశంలో అత్యంత సంప‌న్న‌, ప్రాచీన దేవాల‌యంగా ఇది విరాజిల్లుతుంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. ఇక్కడ శ్రీ అనంతపద్మనాభస్వామి ఆదిశేషుడిని పాన్పుగా చేసుకొని తలను దక్షిణ దిక్కుగా పెట్టుకుని ముఖాన్ని తూర్పు ముఖంగా ఉంచి శయనిస్తున్న ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. శయనాకారంలో దర్శనమిస్తాడు కాబట్టి అనంతశయనుడు అని స్వామికి పేరు వచ్చిందని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. అమ్మవారు శ్రీహరిలక్ష్మీ తాయారు. స్వామి వారి ముఖం, వక్షస్థలం తప్ప మిగతా మూర్తి మొత్తం బంగారంతో పోత పోయబడి తయారుచేయబడింది. తన నాభియందు బ్రహ్మదేవుడు కొలువుదీరిన పద్మాన్ని కల్గి ఉన్న శ్రీమహా విష్ణువే ఈ అనంతపద్మనాభుడు.

అనంతమైన సంపద కలిగి ఉన్న స్వామి. ప్రధానాలయం మలయాళ సాంప్రదాయ పద్ధతిలో నిర్మింపబడి ఉంటుంది. స్వామి వారి విగ్రహం కటుశర్కర యోగం అనే ఆయుర్వేద ఔషధాల మిశ్రమంతో తయారు చేయబడింది. నేపాల్లోని గండకీ నదీతీరం నుంచి ఏనుగులు సహాయంతో తీసుకొచ్చిన 12000 సాలగ్రామాలతో ఈ విగ్రహం తయారుచేయబడింది. పెద్ద విగ్రహం అవుట చేత ఈ స్వామి మూడు ద్వారాల నుంచి భ‌క్తుల‌కు ఈ దర్శనమిస్తాడు. మొదటి భాగంలో విష్ణువు తలభాగము చేతికిందుగా ఉన్న శివలింగాన్ని చూడవచ్చు. ఇక రెండవ భాగంలో నాభి నుండి వెలువడిన కమలం మీద ఆసీనుడైన బ్రహ్మ, మూడవ ద్వారం నుండి విష్ణుమూర్తి పాద పద్మమలు దర్శనమిస్తాయి. అమ్మవార్లు శ్రీదేవి భూదేవులు రెండవ ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తారు.ఈ స్వామిని దర్శించినంతనే సిరి సంప‌ద‌లు కలుగుతాయని చిల‌క‌మ‌ర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel