తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gavaskar On Dravid: రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Gavaskar on Dravid: రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Jul 07, 2024 02:40 PM IST

Gavaskar on Dravid: టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన కోచ్ రాహుల్ ద్రవిడ్ కు భారత రత్న ఇవ్వాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అనడం గమనార్హం. అతడు దానికి అన్ని విధాలా అర్హుడని సన్నీ అన్నాడు.

రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలి: సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Gavaskar on Dravid: టీమిండియా కెప్టెన్‌గా వరల్డ్ కప్ గెలవాలన్న కలను నెరవేర్చుకోని రాహుల్ ద్రవిడ్.. కోచ్‌గా ఆ పని చేయగలిగాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు హెడ్ కోచ్ గా ఉన్న ద్రవిడ్ కు భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డిమాండ్ చేయడం విశేషం.

భారత రత్నకు అర్హుడు

టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచి వారం రోజులు దాటినా.. ఇప్పటికీ దేశంలో ఈ విజయానికి సంబంధించి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో టీమ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కు భారత రత్న ఇవ్వాలంటూ సునీల్ గవాస్కర్ తాను మిడ్‌డే పత్రికకు రాసిన కాలమ్ లో అభిప్రాయపడ్డాడు. ఇండియన్ క్రికెట్ కు అతడు అందించిన సేవలకు గుర్తుగా ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వాలని చెప్పాడు.

"అతనికి భారత ప్రభుత్వం భారత రత్న ఇస్తే బాగుంటుంది. దానికి అతడు అన్ని విధాలా అర్హుడు. ద్రవిడ్ గొప్ప ప్లేయర్, గొప్ప కెప్టెన్. అతని సారథ్యంలోనే ఇండియా.. వెస్టిండీస్ లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఇక ఇంగ్లండ్ పై సిరీస్ గెలిచిన ముగ్గురు కెప్టెన్లలో ఒకడు. నేషనల్ క్రికెట్ అకాడెమీలో యువ నైపుణ్యాన్ని పెంపొందించాడు. సీనియర్ టీమ్ కోచ్ గానూ రాణించాడు" అని గవాస్కర్ అన్నాడు.

నిజానికి ఇప్పటి వరకూ భారత రత్న అందుకున్న ఏకైన స్పోర్ట్స్ పర్సన్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. 2014లో అతనికి ఈ అవార్డు దక్కింది. క్రికెట్ నుంచి రిటైరైన ఏడాదిలోపే అతనికి ఈ అవార్డు రావడం గమనార్హం. అలాంటిది ఇప్పుడు ద్రవిడ్ కు కూడా ఇవ్వాలని గవాస్కర్ డిమాండ్ చేస్తుండటం నిజంగా విశేషమే.

అతని విజయాలు అలాంటివి

రాహుల్ ద్రవిడ్ ఓ ప్లేయర్ గా, కెప్టెన్ గా, కోచ్ గా సాధించిన విజయాలు చిరస్మరణీయమైనవని సన్నీ అభిప్రాయపడ్డాడు. "ద్రవిడ్ సాధించిన ఘనతలు కులం, మతం, జాతి అన్న తేడా లేకుండా దేశంలో అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. ఆ విజయాలకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాల్సిందే. దేశం గర్వించదగిన వాళ్లలో ఒకడైన వ్యక్తికి ఈ అవార్డు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో నాతోపాటు గొంతు కలపండి. రాహుల్ ద్రవిడ్ కు భారత రత్న.. వినడానికి చాలా బాగుంది కదూ" అని గవాస్కర్ అన్నాడు.

2007లో అదే కరీబియన్ దీవుల్లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ద్రవిడ్ కెప్టెన్సీలోనే ఇండియా తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే గడ్డపై కోచ్ గా ద్రవిడ్ తన కల నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ట్రోఫీ అందుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా అతడు ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా కనిపించాడు.

మరి అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వడం సరైనదే అన్నది గవాస్కర్ అభిప్రాయం. నిజానికి అతని డిమాండ్ లోనూ న్యాయం ఉందనే అనిపిస్తోంది. మరి మీరేమంటారు?

WhatsApp channel