తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Ug Answer Key : విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎన్టీఏ! సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీలో అనేక తప్పులు..

CUET UG answer key : విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఎన్టీఏ! సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీలో అనేక తప్పులు..

Sharath Chitturi HT Telugu
Jul 09, 2024 01:40 PM IST

ఎన్టీఏ ప్రకటించిన ఆన్సర్ కీలో సమాధానాలు తప్పుగా ఉన్నాయని సీయూఈటీ యూజీకి హాజరైన పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ‘మీ తప్పులకు మేము ఎందుకు డబ్బులు కట్టి సరిచేసుకోవాలి?’ అని ప్రశ్నిస్తున్నారు.

సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్​ కీలో తప్పులు!
సీయూఈటీ యూజీ 2024 ఆన్సర్​ కీలో తప్పులు!

నీట్​ యూజీ 2024 నిర్వహణపై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకునేలా కనిపిస్తోంది! కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-యూజీకి సంబంధించిన ఆన్సర్​ కీని ఎన్టీఏ జులై 7న ప్రకటించగా, అందులో చాలా తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అబ్జెక్షన్​కి గడవు ఇవ్వగా.. “మీరు చేసిన తప్పులకు మేము ఎందుకు డబ్బులు కట్టాలి?” అని ప్రశ్నిస్తున్నారు.

సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీలో తప్పులు..!

పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవని తేలితే జూలై 15 నుంచి 19 వరకు సీయూఈటీ-యూజీ అభ్యర్థులకు రీటెస్ట్ నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది.

కానీ ఇప్పుడు సీయూఈటీ ఆన్సర్​ కీపైనే చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఒక్కో సమాధానానికి రూ.200 చెల్లించి జూలై 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్​లైన్​లో అభ్యంతరాలను చెప్పొచ్చు.

"సర్, సీయూఈటీ యూజీ ఆన్సర్ కీలో అనేక తప్పులు కనుగొన్నాను. నేను అన్ని దోషాలను సవాలు చేస్తే (అవి తప్పులు అని నేను అనుకుంటున్నాను), సవాలు చేయడానికి అయ్యే ఖర్చు నా సీయూఈటీ అప్లికేషన్ కంటే చాలా ఎక్కువ అవుతుంది," అని రిషబ్ అనే అభ్యర్థి ఎక్స్​లో రాశారు.

మరో అభ్యర్థి బిశాల్ భౌమిక్ మాట్లాడుతూ.. 'నా జియోగ్రఫీ ఓఎంఆర్ షీట్ ను సీయూఈటీ (యూజీ) ఆన్సర్ కీతో చెక్ చేశాను. ఆన్సర్ కీలో 80 శాతం తప్పుగా ఉండటంతో షాక్​కు గురయ్యాను. ఎన్టీఏ అందించే తప్పు సమాధాన కీతో నేను లెక్కించినప్పుడు, నాకు 26 మాత్రమే వచ్చాయి. కానీ వాస్తవానికి నాకు 122 వస్తాయి. అక్కడ నా 17 ప్రశ్నలు సరైనవే," అని అన్నారు.

"కీలో ఇన్ని తప్పుడు సమాధానాలు @NTA_Exams చూడండి, మీ తప్పుకు ఎవరు వేల రూపాయలు చెల్లిస్తారు? ఈ బోగస్ ఆన్సర్ కీ మేము చెల్లించబోము. మూల్యాంకనాన్ని అంగీకరించబోము," అని మరో ఎక్స్ యూజర్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాగిణి నాయక్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఒక సైకాలజీ పేపర్ నుంచి ఒక ప్రశ్న స్క్రీన్ షాట్​ను షేర్​ చేశారు.

రోడ్డుపై ప్రమాదం జరిగితే, చాలా మంది ఆ ప్రదేశంలో గుమిగూడితే దానిని ఏమని పిలుస్తారు? అన్న ఆ ప్రశ్నకు ఎన్సీఈఆర్టీ పుస్తకం క్రౌడ్​ అని సమాధానం ఉందని, కానీ ఎన్టీఏ ఆన్సర్ కీలో సమాధానం ‘ఆడియెన్స్​’గా ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన విద్యార్థి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని అభిప్రాయపడ్డారు.

ఏజెన్సీకి అందిన ఫిర్యాదులపై ఎన్టీఏ అధికారులు స్పందించనప్పటికీ, కొన్ని పరీక్షా కేంద్రాల్లో సమయం వృథా కావడం, సాంకేతిక సమస్యలు తలెత్తాయని అభ్యర్థులు పేర్కొన్నారు.

అభ్యర్థులు చేసే సవాళ్లను సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తుందన్నారు. సవరించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

నీట్, నెట్ సహా పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీయూఈటీ-యూజీ ఫలితాల్లో జాప్యం జరుగుతోంది.

దేశవ్యాప్తంగా తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన సీయూఈటీ-యూజీ పరీక్షను లాజిస్టిక్ కారణాలతో పరీక్షకు ఒక రాత్రి ముందు దిల్లీలో రద్దు చేశారు. అనంతరం దేశ రాజధానిలో పరీక్ష నిర్వహించారు.

సీయూఈటీ-యూజీ మూడో ఎడిషన్ ఏడు రోజుల్లో పూర్తవుతుందని, అన్ని పరీక్షలను ఒకే షిఫ్టులో నిర్వహించనున్నందున స్కోర్ల నార్మలైజేషన్​ ఉండదని ఎన్టీఏ ఇదివరకే ప్రకటించింది.

15 సబ్జెక్టులకు పెన్ పేపర్ విధానంలో, మిగతా 48 సబ్జెక్టులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్ష నిర్వహించారు.

261 కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది 13.4 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

2022లో జరిగిన మొదటి విడత పరీక్షలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. అలాగే, ఒక సబ్జెక్టుకు పలు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల ఫలితాల ప్రకటన సమయంలో స్కోర్లను సాధారణీకరించాల్సి వచ్చింది.

WhatsApp channel

సంబంధిత కథనం