తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: రోహిత్, కోహ్లీ డ్యాన్స్.. ఆ క్షణాలను మరిచిపోలేనన్న కోహ్లీ.. దద్దరిల్లిన వాంఖడే.. రూ.125కోట్లు అందజేత: వీడియో

Team India: రోహిత్, కోహ్లీ డ్యాన్స్.. ఆ క్షణాలను మరిచిపోలేనన్న కోహ్లీ.. దద్దరిల్లిన వాంఖడే.. రూ.125కోట్లు అందజేత: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 04, 2024 11:07 PM IST

Team India Celebrations - T20 World Cup Title: టీ20 ప్రపంచకప్ టైటిల్ విక్టరీ పరేడ్ తర్వాత వాంఖడే స్టేడియంలో సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా భారత ఆటగాళ్లు డ్యాన్స్ చేశారు.

Team India: రోహిత్, కోహ్లీ డ్యాన్స్.. ఆ క్షణాలను మరిచిపోలేనన్న కోహ్లీ.. దద్దరిల్లిన వాంఖడే.. రూ.125కోట్లు అందజేత: వీడియో
Team India: రోహిత్, కోహ్లీ డ్యాన్స్.. ఆ క్షణా���ను మరిచిపోలేనన్న కోహ్లీ.. దద్దరిల్లిన వాంఖడే.. రూ.125కోట్లు అందజేత: వీడియో

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ సంబరాలు గ్రాండ్‍గా జరిగాయి. ముంబైలో నేడు (జూలై 4) భారత జట్టు విక్టరీ పరేడ్‍ భారీ స్థాయిలో జరిగింది. వేలాది మంది అభిమానులు ఈ పరేడ్‍లో పాల్గొన్నారు. విశ్వవిజేతలుగా నిలిచిన భారత ఆటగాళ్లను అభినందనలతో హోరెత్తించారు. విక్టరీ పరేడ్ తర్వాత వాంఖడే స్టేడియంలో ప్రత్యేక సెలెబ్రేషన్స్ జరిగాయి. అభిమానులతో స్టేడియం కిక్కిసిపోయింది. భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అరుపులతో ఫ్యాన్స్ హోరెత్తించారు.

కలిసి డ్యాన్స్ చేసిన రోహిత్, విరాట్

వాంఖడే స్టేడియంలో టీ20 ప్రపంచకప్ టైటిల్ సెలెబ్రేషన్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కలిసి డ్యాన్స్ చేశారు. స్టేడియంలో మంచి ఊపున్న మ్యూజిక్ ప్లే అవుతుండగా.. ముందు రోహిత్, కోహ్లీ కాలుకదిపారు. ఆ తర్వాత మిగిలిన భారత ఆటగాళ్లు కూడా డ్యాన్స్ చేశారు. రోహిత్, కోహ్లీ కలిసి డ్యాన్స్ చేయడం చూసిన ఫ్యాన్స్ మైమరిచిపోయారు. హర్షధ్వానాలతో మోతెక్కించారు.

టీ20 ప్రపంచకప్ టైటిల్, త్రివర్ణ పతాకాలతో స్టేడియమంతా తిరిగారు ఆటగాళ్లు. అభిమానులకు అభివాదాలు చేశారు.

ఆ క్షణాలను మరిచిపోలేను

బార్బడోస్‍లో గత శనివారం (జూన్ 29) దక్షిణాఫ్రికాపై టీ20 ప్రపంచకప్ ఫైనల్ గెలిచిన తర్వాత సందర్భాన్ని విరాట్ కోహ్లీ నేడు వాంఖడేలో గుర్తు చేసుకున్నాడు. ప్రపంచకప్ టైటిల్ గెలిచాక తాను, రోహిత్ ఏడుస్తూ కౌగిలించుకున్నామని, ఆ క్షణాలను ఎప్పటికీ తాము మరిచిపోమని అన్నాడు. “నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు ఏడుస్తున్నా. రోహిత్ కూడా కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఈ సందర్భాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం” అని విరాట్ కోహ్లీ చెప్పాడు. కోహ్లీ ముద్దుపేరైన చీకూ.. చీకూ అంటూ ఫ్యాన్స్ కోలాహలం చేశారు.

తాను, రోహిత్ కలిసి సుమారు 15ఏళ్లుగా ఆడుతున్నామని, అయితే రోహిత్ అంతలా ఎమోషన్ అవడం తాను తొలిసారి చూశానని కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్ గెలువాలని తామిద్దరం ఎప్పటి నుంచో పట్టుదలగా ఉన్నామని, ఇప్పుడు వాంఖడేకు ఈ టైటిల్ తీసుకురావడం గొప్ప ఫీలింగ్ ఇచ్చిందని కోహ్లీ చెప్పాడు.

బుమ్రాపై ప్రశంసలు

టీ20 ప్రపంచకప్‍లో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాను విరాట్ కోహ్లీ అభినందించాడు. భారత్ తరఫున బుమ్రా ఆడడం తమ అదృష్టమని చెప్పాడు. బుమ్రా.. తరానికి ఓసారి వచ్చే లాంటి బౌలర్ అని విరాట్ ప్రశంసించాడు. బుమ్రాను దేశ సంపదగా ప్రకటించే పిటిషన్ వేస్తానని హోస్ట్ గౌరవ్ కపూర్ అంటే.. తాను ఇప్పుడే సంతకం పెడతానని కోహ్లీ అన్నాడు.

రూ.125 కోట్లు అందజేత

టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ ఇటీవలే రూ.125కోట్ల భారీ ప్రెజ్‍మనీ ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్‍ను ఆటగాళ్లకు నేడు వాంఖడే స్టేడియంలో అందజేశారు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా.

గ్రాండ్‍గా పరేడ్

అంతకు ముందు టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన టీమిండియా విక్టరీ పరేడ్ ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగింది. వేలాది మంది అభిమానులు ఈ పరేడ్‍లో పాల్గొన్నారు. నినాదాలతో మోతమోగించారు. ముంబై సాగర తీరమంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. 17 ఏళ్ల తర్వాత భారత్‍కు టీ20 ప్రపంచకప్ వచ్చిన సంతోషం నిండుగా కనిపించింది.

భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకుంది. 2007 తర్వాత మళ్లీ ఇప్పుడు టీ20 ట్రోఫీ పట్టింది. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‍లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ పోరులో గెలిచి విశ్వవిజేతగా టీమిండియా నిలిచింది.

WhatsApp channel