తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 09, 2024 08:16 PM IST

Gautam Gambhir Head coach: టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. మాజీ స్టార్ ఓపెనర్‌ను హెచ్‍కోచ్‍గా ఎంపిక చేసినట్టు బీసీసీఐ నేడు అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ తప్పుకోవడంతో ఆ స్థానంలో గంభీర్ వచ్చేశాడు.

Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
Gautam Gambhir: టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ

చాలాకాలం నుంచి సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. అంచనాలే నిజమయ్యాయి. భారత క్రికెట్ జట్టు హెడ్‍కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నేడు (జూలై 9) అధికారికంగా ప్రకటించింది. దీంతో టీమిండియాలో హెడ్ కోచ్‍గా గంభీర్ శకం మొదలైంది. ఒకప్పుడు ఆటగాడిగా అద్భుత బ్యాటింగ్‍తో భారత్‍కు చాలా చిరస్మరణీయ విజయాలు అందించిన అతడు.. ఇక ప్రధాన కోచ్‍గా ప్రస్థానం మొదలుపెడుతున్నాడు.

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ తర్వాత హెడ్ కోచ్ స్థానం నుంచి దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నాడు. దీంతో ఆ ప్లేస్‍లో గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ నియమించింది. గంభీరే కొత్త హెడ్ కోచ్ అవుతాడని కొంతకాలంగా సమాచారం చక్కర్లు కొడుతుండగా.. ఆలస్యమవుతుండటంతో సస్పెన్స్ పెరిగింది. అయితే, ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా నేడు ట్వీట్ చేశారు. గంభీర్‌ను కొత్త హెడ్ కోచ్‍గా నియమించినట్టు వెల్లడించారు.

గంభీర్.. సరైనోడు

అధునిక క్రికెట్ వృద్ధిని గంభీర్ దగ్గరి నుంచి చూశాడని, ఈ తరుణంలో భారత హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంబీరే సరైనోడని జై షా ట్వీట్ చేశారు. భారత జట్టును అతడు సమర్థవంతంగా ముందుకు నడుపుతాడనే నమ్మకం తమకు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. “భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్‌కు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. అధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది, మార్పులన్నింటినీ గంభీర్ చాలా దగ్గరి నుంచి వీక్షించాడు. తన కెరీర్లో వివిధ బాధ్యతల్లో రాణించి, సవాళ్లను అధిగమించాడు. భారత క్రికెట్ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు గంభీర్ సరైన వ్యక్తి అని నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది” అని జైషా ట్వీట్ చేశారు.

టీమిండియా పట్ల గౌతమ్ గంభీర్‌కు స్పష్టమైన విజన్ ఉందని జై షా పేర్కొన్నారు. అతడికి ఉన్న అపార అనుభవం.. ఈ హెడ్ కోచ్ స్థానం స్వీకరించేందుకు సరిగ్గా సూటవుతుందని తెలిపారు. ఈ కొత్త ప్రయాణంలో గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ పూర్తిగా మద్దతు ఇస్తుందని జై షా వెల్లడించారు. జూలై 27న మొదలుకానున్న శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్ కోచ్‍గా గంభీర్ ప్రస్థానం షురూ కానుంది. 2027 వరకు అతడి పదవీ కాలం ఉంటుందని తెలుస్తోంది.

ఐపీఎల్ సక్సెస్‍తో..

ఈ ఏడాది ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్‌గా చేశాడు. అతడి మార్గదర్శకత్వం, దూకుడైన నిర్ణయాలతో కోల్‍కతా టైటిల్ గెలిచింది. ఒకప్పుడు కెప్టెన్‍గా గంభీర్ ఉన్నప్పుడు రెండు టైటిళ్లు గెలిచిన కేకేఆర్.. మళ్లీ ఇప్పుడు అతడు మెంటార్‌గా వచ్చాక విజేతగా నిలిచింది. ఐపీఎల్‍లో మెంటార్‌గా గంభీర్ సక్సెస్ అవడంతో టీమిండియాకు అతడిని హెడ్ కోచ్ చేయాలని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీసీసీఐ కూడా అదే దిశగా చర్యలు చేపట్టింది. రాహుల్ ద్రవిడ్ తప్పుకోవటంతో ఆ స్థానంలో గంభీర్‌నే నియమించింది.

టీమిండియాలో ఆటగాడిగా గంభీర్ కెరీర్

భారత జట్టు తరఫున గౌతమ్ గంభీర్ 58 టెస్టులు ఆడాడు. 4,154 పరుగులు చేశాడు. 9 శతకాలు, 22 అర్ధ శతకాలు బాదాడు. 147 వన్డేలు ఆడిన గంభీర్ 5,238 రన్స్ సాధించాడు. 11 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీ చేశాడు. భారత్ తరఫున 37 టీ20ల్లో 934 రన్స్ చేయగా.. అందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‍లో గౌతమ్ గంభీర్ 97 పరుగులు చేశాడు. శ్రీలంకపై తుదిపోరులో గెలిచి భారత్ విజయం సాధించి ప్రపంచకప్ టైటిల్ అందుకోవడంలో గౌతమ్‍దే ప్రధాన పాత్ర. టీమిండియా తరఫున ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు గంభీర్. పట్టుదల, పోరాటంతో చాలా మ్యాచ్‍ల్లో జట్టును గెలిపించాడు.

టీమిండియా గత నెలలోనే టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్ గెలిచింది. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్ అయ్యాడు. వన్డేలు, టెస్టులకు కెప్టెన్సీ కొనసాగించనున్నాడు. రోహిత్, కోచ్ గంభీర్ కాంబినేషన్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

WhatsApp channel