తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024: బడ్జెట్ వచ్చేస్తోంది.. ఈ పన్నుల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

Budget 2024: బడ్జెట్ వచ్చేస్తోంది.. ఈ పన్నుల గురించి మీరు తెలుసుకోవాల్సిందే..

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 07:29 PM IST

Budget 2024: కేంద్ర బడ్జెట్ 2024 ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ నెల 23వ తేదీన లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ అర్థం కావాలంటే మన దేశంలోని పన్నుల వ్యవస్థ గురించి, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల గురించి తెలిసి ఉండాలి. ఈ బడ్జెట్ లో ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్ల తగ్గిస్తారన్న అంచనాలు ఉన్నాయి.

భారతదేశంలోని పన్నుల వ్యవస్థ
భారతదేశంలోని పన్నుల వ్యవస్థ

Budget 2024: బడ్జెట్ అంటే స్థూలంగా ఆదాయ, వ్యయాల పట్టిక. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా సంపాదించే ఆదాయం.. వివిధ అవసరాల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు బడ్జెట్ లో ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాల్లో ప్రధానమైనవి ప్రత్యక్ష, పరోక్ష పన్నులు. వాటి గురించి తెలుసుకుందాం.

ప్రత్యక్ష పన్నులు అంటే ఏమిటి?

ప్రత్యక్ష పన్నులు అనేది ఒక వ్యక్తి లేదా సంస్థల ఆదాయంపై ప్రభుత్వం విధించే పన్నులు. వీటిలో ఆదాయ పన్ను, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, వెల్త్ టాక్స్ మొదలైనవి ఉంటాయి.

ఆదాయపు పన్ను: ప్రత్యక్ష పన్నుల్లో ఆదాయ పన్ను అత్యంత ప్రసిద్ధ ఉదాహరణ. ఇది ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఆదాయంపై విధించే పన్ను. ఇది ప్రగతిశీల పన్ను, అంటే ఆదాయం పెరిగే కొద్దీ, చెల్లించాల్సిన పన్ను మొత్తం కూడా పెరుగుతుంది. భారతదేశంలో ఆదాయ పన్ను (Income tax) చెల్లించడానికి ప్రస్తుతం రెండు వేర్వేరు విధానాలు ఉన్నాయి. వీటిని కొత్త విధానం మరియు పాత విధానం అని పిలుస్తారు. మరింత సులువైన పన్ను చెల్లింపు ప్రక్రియను పన్ను చెల్లింపుదారుల ముందుకు తీసుకురావడం కోసం కొత్త పన్ను విధానాన్ని తీసుకువచ్చారు. అయితే, టాక్స్ పేయర్ తనకు ఇష్టమైతేనే, కొత్త విధానంలోకి మారవచ్చు. ఇతర రకాల ప్రత్యక్ష పన్నులలో మూలధన లాభాల పన్ను (capital gains tax), ఇది రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులను విక్రయించడం ద్వారా సంపాదించిన లాభాలపై, స్టాక్ ఎక్స్ఛేంజీలలో షేర్ల అమ్మకం కోసం ద్వారా వచ్చిన లాభాలపై ఈ పన్ను వేస్తారు. అలాగే, గిఫ్ట్ టాక్స్, వెల్త్ టాక్స్ మొదలైనవి కూడా ప్రత్యక్ష పన్నులే.

పరోక్ష పన్నులు అంటే ఏమిటి?

పరోక్ష పన్నులు అంటే ప్రజలు నేరుగా కాకుండా, పరోక్ష విధానంలో చెల్లించే పన్నులు. ఇవి వస్తువులు, సేవల వినియోగంపై ప్రభుత్వం విధించే పన్నులు. ఉదాహరణకు జీఎస్టీ.

వస్తు, సేవల పన్ను (GST): వస్తుసేవల వినియోగంపై ప్రభుత్వం జీఎస్టీని విధిస్తుంది. జీఎస్టీలో 0%, 5%, 12%, 18%, 28% పన్ను శ్లాబులు ఉన్నాయి. ఆయా జీఎస్టీ శ్లాబుల పరిధిలోకి వచ్చే వస్తువులను జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. సాధారణంగా, నిత్యావసర వస్తువులకు తక్కువ పన్ను శ్లాబ్, లగ్జరీకి ఎక్కువ పన్ను శ్లాబ్ ఉంటుంది. జీఎస్టీని నాలుగు రకాలుగా విభజించారు: సెంట్రల్ జీఎస్టీ (CGST), స్టేట్ జీఎస్టీ (SGST), కేంద్రపాలిత జీఎస్టీ (UGST), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST). పరోక్ష పన్నులకు ఇతర ఉదాహరణలు విలువ ఆధారిత పన్ను (VAT), సేవా పన్ను, ఎక్సైజ్ సుంకం మొదలైనవి.

WhatsApp channel